రాష్ట్రపతి vs సుప్రీం కోర్ట్
రాష్ట్రపతి ముర్ము..సుప్రీం ని అడిగిన 14 ప్రశ్నలివే ...
రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను పరిశీలన పేరుతో గవర్నర్లు, రాష్ట్రపతి నెలల తరబడి జాప్యం చేస్తుండటంపై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. . గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడుకు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను రాష్ట్ర గవర్నర్ RN రవి ఆపేయడంపై ఇటీవలే సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ , ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ బిల్లులకు క్లియరెన్స్ ఇచ్చింది. ఏదైనా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెలరోజులు మాత్రమేనని 415 పేజీలతో కూడిన తీర్పును సుప్రీం కోర్టు వెల్లడించింది.
అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు పై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేది లేనప్పుడు ఈ తీర్పు ఎలా ఇవ్వగలరని రాష్ట్రపతి ముర్ము బుధవారం అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించారు. జస్టిస్ జేబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ఇచ్చిన 415 పేజీల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 …1 కింద రాష్ట్రపతికి ఉన్న అరుదైన అధికారాలను ఉపయోగించి 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. ఈ ప్రశ్నల్లో రాజ్యాంగ అధికారాలు, పరిమితులు, శాసన ప్రక్రియలకు సంబంధించినవి ఉన్నాయి. దీంతో భారత ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము కి, భారత అత్యున్నత న్యాస్థానానికి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడినట్లయింది . నూతన సీజేఐగా జస్టిస్ బి.ఆర్.గవాయ్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రపతి ముర్ము ఈ తీర్పుపై స్పందించడం గమనార్హం. రాష్ట్రపతి ముర్ము..సుప్రీం ని అడిగిన 14 ప్రశ్నలివే …
1. రాష్ట్ర అసెంబ్లీ పంపించిన బిల్లును.. గవర్నర్ స్వీకరించిన తర్వాత ఆర్టికల్ 200 కింద రాజ్యాంగం సూచించిన నిబంధనలు ఏంటి..?
2. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులపై నిర్ణయం తీసుకునే సమయంలో గవర్నర్.. కేబినెట్ నిర్ణయం, సలహాల మేరకు మాత్రమే వ్యవహరించాలా..?
3. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకున్న విచక్షణాధికార నిర్ణయం న్యాయ పరిశీలనకు లోబడి ఉంటుందా..?
4. ఆర్టికల్ 200 కింద గవర్నర్ నిర్ణయాలు కోర్టుల సమీక్ష, విచారణల నుంచి ఆర్టికల్ 361 కాపాడుతుందా..?
5. గవర్నర్ ఎంత సమయంలో నిర్ణయం తీసుకోవచ్చు అనే విషయంపై రాజ్యాంగంలో స్పష్టమైన కాల పరిమితి లేనప్పుడు.. బిల్లులపై నిర్ణయం తీసుకోవటానికి గవర్నర్లకు న్యాయ వ్యవస్థ గడువు విధించవచ్చా..?
6. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారాన్ని న్యాయ పరంగా సమీక్షించవచ్చా..?
7. రాజ్యాంగబద్ధమైన ఆదేశాలు లేనప్పుడు.. న్యాయపరంగా సూచించిన గడువునకు, కాలానికి రాష్ట్రపతి కట్టుబడి ఉంటారా..?
8. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ రిజర్వ్ చేసినప్పుడు.. నిర్ణయం తీసుకోకుండా ఉన్నప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా..?
9. బిల్లు చట్టంగా మారే ముందు.. గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా..?
10. రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయాలను తీసుకోవటానికి లేదా మార్పులు చేయటానికి ఆర్టికల్ 142 కింద అనుమతి ఉందా..?
11. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ ఆమోదం లేకుండా చట్టంగా మారుతుందా..?
12. రాజ్యాంగ సవరణ ప్రశ్నలను ఆర్టికల్ 145(3) కింద ముందుగా రాజ్యాంగ ధర్మాసనానికి సూచించాలా..?
13. ఆర్టికల్ 142 కింద.. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా.. కోర్టు తీర్పులను అనుమతిస్తుందా..?
14. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివాదాలను.. సుప్రీంకోర్టు పరిధిని నిర్దేశించే ఆర్టికల్ 131 పరిధిలో కాకుండా పరిష్కరించవచ్చా..?
ప్రస్తుతం ఈ ప్రశ్నలు , రాష్టప్రతి ..సుప్రీమ్ మధ్య వివాదం బాగా ట్రెండింగ్ లో ఉంది .




