వదిలిపెట్టే ప్రసక్తే లేదు… తిహాడ్ జైలు బయట కవిత స్ట్రాంగ్ వార్నింగ్

170 రోజుల తర్వాత బయటికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొందరిని ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జైలు నుంచి బయటికి వచ్చిన వెంటనే ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటి పర్యంతమయ్యారు. తాను కేసీఆర్ బిడ్డనని, తప్పు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనను అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారని చెప్పారు. పిడికిలి బిగించి జై తెలంగాణ నినాదాలు చేశారు
18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నోఎత్తుపల్లాలు చేశాను. తన పిల్లలను వదిలి ఐదున్నర నెలలు జైల్లో ఉండడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇలాంటి ఇబ్బందులకు గురిచేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం. సమయం వస్తది.. తప్పకుండా చెల్లిస్తాం. అదే విధంగా ఇలాంటి కష్టసమయంలో మాకు, మా కుటుంబానికి తోడుగా ఉన్నవారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు. నేను తెలంగాణ బిడ్డను.. కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని.. మంచిదాన్ని. నన్ను అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేశారు. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా పని చేస్తాం. కమిట్మెంట్తో పని చేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటాం. మేం ఎవరికీ భయపడం.. న్యాయపరంగా పోరాడుతూనే ఉంటాం. నన్ను అనవసరంగా జైలుకు పంపారు అని కవిత పేర్కొన్నారు.
కవిత జైలు నుంచి నేరుగా ఢిల్లీలోని వసంత్ విహార్ లో ఉన్న బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ మహిళా కార్యకర్తలు కవితకు గుమ్మడికాయతో దిష్టితీసి స్వాగతం పలికారు. బాణా సంచాలు కాల్చి సంబరాలు చేశారు. కవిత కుటుంబ సభ్యులతోపాటు పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుకున్నారు. కవిత కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి బీఆర్ఎస్ కార్యాలయంలోనే బస చేయనున్నట్టు ముఖ్య నేత ఒకరు తెలిపారు. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో మద్యం పాలసీ కేసులో కవితతోపాటు మరో నలుగురిపై సీబీఐ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్ పై విచారణ జరగనుంది. అయితే, కవిత విచారణకు వర్చువల్ గా హాజరయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2.45కు ఢిల్లీ నుంచి కవిత భర్త అనిల్, కుమారుడు ఆర్యతోపాటు కేటీఆర్, హరీశ్ రావు మిగిలిన పార్టీ నేతలు అందరూ కలిసి విమానంలో హైదరాబాద్ వచ్చారు.


