సేవల రంగంలోని టిప్‌లపై పన్ను ఎత్తివేస్తాం’ – కమలా హారిస్‌ హామీ

రెస్టారెంట్లలో పని చేసే కార్మికులతోపాటు, ఇతర సేవల రంగాల్లోని వారికి ఇచ్చే టిప్‌లపై పన్నును ఎత్తివేస్తామని డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ హామీ ఇచ్చారు. అమెరికాలోని కార్మిక కుటుంబాల తరఫున పోరాడతానని ఆమె పేర్కొన్నారు. లాస్‌ వేగాస్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ నెవాడాలో జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, వినోద పరిశ్రమలపై దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉందని కమలా హారిస్ పేర్కొన్నారు.

“ప్రతి ఒక్కరికీ ఇది నా హామీ. నేను అధ్యక్షురాలినయ్యాక అమెరికాలోని పని చేసే కుటుంబాల కోసం పోరాడతా. కనీస వేతనాలు పెంచేందుకు కృషి చేస్తా. టిప్‌లపై పన్నును ఎత్తివేస్తా” అని కమలా హారిస్‌ హామీ ఇచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సర్వేల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. తాజాగా న్యూయార్క్‌ టైమ్స్, సియానా కళాశాల సంయుక్తంగా స్వింగ్‌ రాష్ట్రాల్లో (విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగన్‌) సర్వే నిర్వహించాయి. ఇందులో హారిస్‌ 4 పాయింట్ల ఆధిక్యంతో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ముందంజలో ఉన్నట్లు తేలింది. ఆగస్టు 5, 9 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో మూడు రాష్ట్రాల్లో ట్రంప్‌నకు 46 శాతం, కమలా హారిస్‌కు 50 శాతం మంది ఓటర్లు మద్దతుగా ఉన్నట్లు వెల్లడైంది.

Related Articles

Back to top button