బంగ్లాలో బిక్కుబిక్కుమంటూ హిందువులు! మైనార్టీలపై దాడులకు కారణం అదేనా?

బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలు భయంతో వణికిపోతున్నారు!. ఎప్పుడు, ఏ వైపు నుంచి దుండగులు వచ్చి దాడులు చేస్తారో అని వారు తమ కుటుంబాలతో కలిసి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు! రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు చేసిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చి చివరికి అవామీలీగ్ అధినేత్రి షేక్ హసీనా ప్రధాని పదవి నుంచి తప్పుకొని భారత్‌లో తలదాచుకోవాల్సి వచ్చింది. సెక్యులర్ పార్టీగా గుర్తింపు పొందిన అవామీ లీగ్‌కు ఎన్నో ఏళ్లుగా మద్దతుగా నిలుస్తున్నందుకు హిందువులపై దాడులు జరుగుతున్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. హిందువుల నివాసాలు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా మందిరాలపై దాడులు చేశారని, ఆస్తులను తగులబెట్టారని హిందూ నేతలు చెబుతున్నారు. కొందరిని వెంటాడి మరీ చంపారని వారు అంటున్నారు.
‘హిందువులు వణికిపోతున్నారు’
ఈనెల 5వ తేదీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిన తర్వాత బంగ్లాదేశ్‌లోని 52 జిల్లాల్లో హిందూ మైనార్టీలపై 200కుపైగా దాడులు జరిగినట్లు బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ సంఘం తెలిపింది. “ప్రతి కుటుంబం, ప్రతి చోట వణికిపోతోంది. ఢాకాలో ఫ్లాట్లల్లో ఉన్నవారు కూడా తలుపులు మూసుకొని ఉంటున్నారు. ఎవరు వచ్చారో తెలుసుకున్నాకే తలుపులు తెరుస్తున్నారు.” అని బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ సంఘం ఉపాధ్యక్షుడు కాజల్ దేవ్‌నాథ్ తెలిపారు.
అల్లరిమూకల దాడుల వల్ల 65ఏళ్ల విశ్రాంత ఆడిటర్ అరబిందా మొహల్డర్ కుటుంబానికి ప్రాణభయం పట్టుకుంది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం, తాను అవామీ లీగ్ పార్టీ మద్దతుదారు కావటం వల్ల అల్లరిమూకలు అరబిందా ఇంటిని తగులబెట్టాయి. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆయన, భార్యతో కలిసి బట్టలు, పాస్‌పోర్టు తీసుకొని ఇంటి నుంచి బయటపడ్డారు. సమీపంలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. అదే రోజు సాయంత్రం వెళ్లిచూడగా ఆయన ఇంటిని దుండగులు తగులబెట్టారు. టీవీ, ఫ్రిడ్జ్, 2 ఏసీలుసహా ఆయన ఇంట్లోని ప్రతి వస్తువును ఎత్తుకెళ్లారు.
“నేను నా ఇంటికి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలాకాలం నుంచి నేను అక్కడే ఉంటున్నాను. కానీ దాడులు, దోపిడీల మూలంగా అల్లరి మూకల భయం వెంటాడుతోంది.”
— అరబిందా మొహల్డర్, అవామీ లీగ్ మద్దతుదారు
‘అందుకే దాడి చేశారు’
అయితే, అరబిందా మొహల్డర్ ఉండే గ్రామంలో పదుల సంఖ్యలో హిందూ మైనార్టీ కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిపై మాత్రం దాడులు జరగలేదు. మొహల్డర్ నివాసానికి పక్కనే ఆయన బావ ఇల్లు కూడా ఉంది. దుండగులు ఆయన జోలికి కూడా వెళ్లలేదు. ఆ ఆవరణలోనే వారికి సంబంధించిన ప్రార్థనా మందిరం కూడా ఉంది. దాన్నికూడా ముట్టుకోలేదు. అరబిందా మొహల్డర్‌కు అవామీ లీగ్‌తో సంబంధాలు ఉండటం వల్లనే అల్లరి మూకలు ఆయనను లక్ష్యంగా చేసుకున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
‘అవి మతపరమైన దాడులు కావు’
హిందూ మైనార్టీలపై జరిగిన దాడులు రాజకీయపరమైనవే తప్ప మతపరమైనవి కావని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అవి హసీనా సర్కార్‌పై ఉన్న వ్యతిరేకతను చాటినట్లు తెలిపారు. “కొంతమంది హిందువులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇవి రాజకీయపరమైనవి. ప్రధానంగా అవామీ లీగ్‌ను టార్గెట్ చేశారు. అవామీ లీగ్ మద్దతుదారులైన హిందువులు, పదవుల్లో ఉన్న కొందరిపై దాడులు జరిగాయి. దాడులకు అదే ప్రధాన కారణం. మతపరమైన దాడులు కావు.” అని సెంటర్ ఫర్ గవర్నెన్స్ స్టడీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రెహమాన్ తెలిపారు.



