కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ లో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులు, కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో పుట్టిస్తున్న నేపథ్యంలో అక్రమార్కులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్న వారి వెన్నులో వణుకు పుట్టించే ప్రకటన చేశారు. హైదరాబాద్‌లో ఆక్రమణలకు గురైన చెరువులను సంరక్షించడమే లక్ష్యంగా, ఆక్రమణలు తొలగించడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా.. విధి నిర్వహణలో అంచనాలకు మించి దూకుడు ప్రదర్శిస్తోంది. దీంతో అక్రమార్కులు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా హైడ్రా చర్యలపై, నిర్ణయాలపై ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. హైడ్రాపై వస్తున్న ఆరోపణలుకు క్లారిటీ ఇచ్చారు.
ఓవైసీ అయినా.. మల్లారెడ్డి అయినా.. పల్లా రాజేశ్వర్ రెడ్డి అయినా.. ఎవరైనా హైడ్రాకు ఒక్కటేనని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. చెరువులు, నాళాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఏమాత్రం ఆలోచించకుండా వాటిని కూల్చివేస్తామని స్పష్టమైన ప్రకటన చేశారు. హైడ్రా ఎవ్వరికి నోటీసులు ఇవ్వదని.. డైరెక్ట్ కూల్చివేతలే చేస్తుందని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు కమిషనర్ రంగనాథ్. హైడ్రా అనేది రాజకీయ చదరంగంలో పాము అవ్వదల్చుకోలేదన్నారు. తమకు అందరూ సమానమేనని స్పష్టం చేశారు.


